కోల్‌కతా/న్యూఢిల్లీ, ఆగస్టు 12: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానల రెసిడెంట్ డాక్టర్లు సోమవారం ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో పలు రాష్ర్టాల్లోని దవాఖానల్లో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఓపీ సేవలు, అత్యవసరం కాని సర్జరీలు నిలిచిపోయాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళననకారులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్, ఆర్ఎంఎల్ ఇతర ప్రభుత్వ దవాఖానల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. జూనియర్ డాక్టర్ల విధుల బహిష్కరణతో పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా దవాఖానల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. తమ సహచర వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి చేత నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. బాధితురాలి పోస్టుమార్టం నివేదికతోపాటు హత్యాచారం జరిగిన మెడికల్ కాలేజీ సెమినార్ హాల్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని దవాఖానల్లో వైద్యుల భద్రతకు కేంద్రం ప్రొటోకాల్ విడుదల చేయాలని ఫోర్డా డిమాండ్ చేసింది.
వచ్చే ఆదివారం నాటికి పోలీసులు కేసును పరిష్కరించలేకుంటే కేసును సీబీఐకి బదిలీ చేస్తామని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. సోమవారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులకు మరణశిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా, బాధితురాలు ఆత్మహత్య చేసుకుని మరణించిందని తొలుత దవాఖాన అసిస్టెంట్ సూపరింటెండెంట్ బాధితురాలి కుటుంబానికి ఫోన్ చేసి తెలిపినట్టు తెలిసింది. దీంతో అతడిని పోలీసులు విచారణకు పిలిచారు.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌కు ఏం జరిగిందో నీకూ అదే జరుగుతుందని శుక్రవారం రాత్రి బెంగాల్‌లోని పుర్బ బర్ధమాన్ జిల్లాలో ఓ పౌర వలంటీర్ ఓ ప్రభుత్వ దవాఖాన వైద్యురాలిని బెదిరించడం సంచలనంగా మారింది.