కోల్‌కతా: ఆర్జీ కర్ దవాఖానలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడిన సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు పడింది. ఈ మేరకు సోమవారం సియాల్దా కోర్టు అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ శిక్ష ఖరారు చేశారు. ఈ నేరం ‘అత్యంత అరుదైన’ విభాగంలోకి రాదని, అందుకే మరణశిక్ష విధించడం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. సెక్షన్ 64, 66, 103(1) కింద మరణించే వరకు జైలులో ఉండేలా యావజ్జీవ జైలు శిక్షతో పాటు, రూ.50 వేల జరిమానా విధిస్తున్నట్టు చెప్పారు. బాధితురాలు తన పని ప్రదేశమైన దవాఖానలో మరణించినందున ఆమె కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని న్యాయస్థానం పేర్కొన్నది. హత్య ఘటనకు రూ.10 లక్షలు, అత్యాచార ఘటనకు రూ.7 లక్షలు కలిపి రూ.17 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
శిక్ష ఖరారు చేసే ముందు న్యాయస్థానంలో ఇరుపక్షాల వాదనలు విన్నది. దోషికి మరణ శిక్ష విధించాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, అమాయకుడినని, అన్యాయంగా కేసులో ఇరికించారని సంజయ్ రాయ్ చెప్పుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసు అత్యంత అరుదైన కేటగిరిలోకి రాదని పేర్కొంటూ మరణించే వరకు జైలులో ఉండేలా జీవిత ఖైదు ఖరారు చేసింది. కాగా, తీర్పుపై కోల్‌కతా హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని, అవసరమైతే న్యాయ సహాయాన్ని పొందవచ్చని దోషి సంజయ్ రాయ్‌కు కోర్టు సూచించింది.
సియాల్దా కోర్టు తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ తీర్పుతో మేము షాక్‌కు గురయ్యాం. ఒక డ్యూటీ డాక్టర్ అత్యాచారం, హత్యకు గురవడం అత్యంత అరుదైన నేరం కాదా? ఈ నేరం వెనుక పెద్ద కుట్ర ఉంది. కేసు విచారణ సరిగ్గా జరగలేదు. చాలామంది నేరస్థులను రక్షిస్తున్నారు. న్యాయం జరిగే వరకు మేం పోరాడతాం. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం’ అని వారు పేర్కొన్నారు. కాగా, తీర్పుపై స్పందించేందుకు సంజయ్ రాయ్ తల్లి మాలతి నిరాకరించింది. ‘నేనేమీ మాట్లాడలేను. జరిగిన ఘటనలకు సిగ్గుపడుతున్నా. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అని విలేకరులపై ఆమె అరిచారు.
కోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కేసును మా చేతుల్లోంచి బలవంతంగా లాక్కున్నారు. కోల్‌కతా పోలీసులు కేసు విచారించి ఉంటే మరణశిక్ష పడేలా చేసేవారు. పోలీసులు విచారించిన ఇలాంటి అనేక కేసుల్లో మరణశిక్ష పడింది’ అని ఆమె అన్నారు. తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.