Kolkata Doctor Case | కోల్‌కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ కేసును కోర్టు సుమోటోగా తీసుకొని విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేసును విచారణ జరిపింది. ఇంతకు ముందు జూనియర్ డాక్టర్ ఘటనపై నిరసన తెలుపుతున్న వైద్యులను విధుల్లో చేరాలని ఇంతకు ముందు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. మంగళవారం విచారణ సందర్భంగా సీబీఐని కోర్టు ప్రస్తుత స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కోరింది. అలాగే, హాస్పిటల్ ఆర్థిక అవకతవకలపై దర్యాప్తుకు సంబంధించి రిపోర్ట్‌ను సమర్పించాలని సీబీఐకి చెప్పింది. ఈ సందర్భంగా కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారం అంశంపై బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయాలని కోరారు. ఇలాంటి కేసులను ప్రత్యక్ష ప్రసారం చేసినప్పుడు అది ప్రభావాన్ని చూపుతుందన్నారు. తాము నిందితులకు ప్రాతినిథ్యం వహించడం లేదని.. 50 సంవత్సరాల రెప్యుటేషన్ ఉందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఇది ఓపెన్ కోర్టు అని.. ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశమని తెలిపింది. కపిల్ సిబల్ స్పందిస్తూ ఇది తమ ప్రతిష్టకు సంబంధించిందన్నారు. ఛాంబర్లోని మహిళా న్యాయవాదులకు యాసిడ్ దాడి, అత్యాచారం చేస్తామని బెదిరింపులు వస్తున్నాయన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులకు సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయని సిబల్ ప్రస్తావించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపబోమని స్పష్టం చేసింది. లాయర్లు, ఇతరులకు ఏదైనా ముప్పు వాటిల్లితే చర్యలు తీసుకుంటామని సిబల్‌కు కోర్టు భరోసా ఇచ్చింది.