కోల్‌కతా, జనవరి 18: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ వైద్య కళాశాల ట్రెయినీ డాక్టర్ లైంగిక దాడి, హత్య ఘటనలో అరెస్టయిన సంజయ్ రాయ్‌ను న్యాయస్థానం శనివారం దోషిగా నిర్ధారించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కాగా ఆర్జీ కర్ దవాఖాన డాక్టర్లు, వైద్య విద్యార్థులు సుదీర్ఘకాలం ఆందోళనలు నిర్వహించారు. 2024 ఆగస్టు 9న జరిగిన ఈ అమానుష ఘటనలో సాల్డా కోర్టు సోమవారం(జనవరి 20) తీర్పును వెలువరిస్తుందని అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి అనిర్బన్ దాస్ తెలిపారు. మహిళా డాక్టర్‌పై సంజయ్ రాయ్ లైంగిక దాడికి పాల్పడడంతోపాటు ఆమెను గొంతు నులిమి చంపినట్టు నిర్ధారణ అయిందని,అన్ని ఆరోపణలకు సీబీఐ తగిన సాక్ష్యాధారాలను చూపిందని న్యాయమూర్తి తెలిపారు.
అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించి సాక్షులను విచారించి, వాదనలు కూడా విన్నాను. వీటన్నిటి ఆధారంగా నువ్వు దోషివని తేలింది. నువ్వు దోషివి. నీకు శిక్ష పడాల్సిందే అని న్యాయమూర్తి ప్రకటించారు. ఈ సందర్భంగా సంజయ్ రాయ్ తాను నిర్దోషినని, ఈ కేసులో తనను ఇరికించారని చెప్పాడు. తనను ఈ కేసులో ఇరికించిన ఐపీఎస్ అధికారితోసహా అందరినీ ఎందుకు విడుదల చేశారని అతను ప్రశ్నించాడు. ఈ కేసులో సాక్ష్యాలను మార్చినందుకు ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తోపాటు స్థానిక పోలీసు స్టేషన్ మాజీ ఎస్హెచ్ఓకు బెయిల్ ఇవ్వడాన్ని రాయ్ ప్రశ్నించాడు.
న్యాయమూర్తి తీర్పును ప్రకటించిన అనంతరం పోలీసులు దోషిని కోర్టు రూము నుంచి గట్టి బందోబస్తు మధ్య ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌కు తరలించారు. న్యాయమూర్తి తీర్పు విని బాధితురాలి తండ్రి భావోద్వేగానికి గురై విలపించారు. న్యాయవ్యవస్థపై తాము ఉంచుకున్న నమ్మకాన్ని న్యాయస్థానం నిలబెట్టుకుందని ఆయన తెలిపారు. తన చార్జిషీటులో నగర పోలీసు శాఖలో సివిక్ వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్ రాయ్‌ను ఈ కేసులో ప్రధాన, ఏకైక అనుమానితుడిగా దర్యాప్తు సంస్థ సీబీఐ పేర్కొంది. నిందితుడికి మరణ శిక్ష విధించాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది.