Kill stranger | ఎప్పుడూ ఏదో వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచే గజియాబాద్ బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు గజియాబాద్‌లో అల్లర్ల వరకు వెళ్లింది. ఈ సారి ఇంటికొచ్చే అపరిచిత వ్యక్తులను చంపాలంటూ ఉచిత సలహా ఇచ్చి వార్తల్లో నిలిచారు.
గజియాబాద్ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ సారి విద్యుత్ బిల్లులు తీసేందుకు వచ్చే నకిలీ ఉద్యోగులను కాల్చివేయాలని సూచించారు. విద్యుత్ ఉద్యోగిగా ప్రస్తుతం చాలా మంది నకిలీలు ఇండ్లకు వస్తున్నారని, వారిని ఐడీ కార్డ్ అడిగి నకిలీగా తేలగానే కాల్చిచంపేయాలి అని పిలుపునిచ్చారు. వారిని చంపడం చేతకాకపోతే తనకు సమాచారం ఇస్తే తానే వచ్చి వారిని చంపేస్తానని ప్రజలతో చెప్పడం సంచలనంగా మారింది. విద్యుత్ ఉద్యోగులమంటూ ఓ ఇంట్లోకి వచ్చిన కొందరు వ్యక్తులు ఆ ఇంట్లోని లక్షన్నర నగదును ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్ దృష్టికి తేవడంతో పైవిధంగా స్పందించారు.
బిల్లులు చెల్లించాలంటూ ఉద్యోగులు ఇండ్లకు వస్తున్నారన్న విషయాన్ని ఎమ్మెల్యే స్థానిక విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఉద్యోగులు ఎవరూ బిల్లుల కోసం ఇంటి వద్దకు వెళ్లడం లేదని అధికారులు స్పష్టం చేశారు. దాంతో ఇకముందు ఎవరైన అపరిచిత వ్యక్తులు విద్యుత్ ఉద్యోగులుగా చెప్తూ ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే కాల్చి చంపేయాలని ప్రజలకు ఎమ్మెల్యే గుర్జార్ పిలుపునిచ్చారు. నకిలీలను పట్టుకుని విద్యుత్ అధికారులకు అప్పగించాలని ఆయన కోరారు. ముస్లింలు ఈద్ సందర్భంగా జంతువులకు బదులుగా తమ పిల్లలను బలివ్వాలని సూచించి ఎమ్మెల్యే గుర్జార్ వివాదాస్పదమయ్యారు.