న్యూఢిల్లీ : పిల్లలకు స్మార్టఫోన్లు ఇస్తే వారిని మానసిక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని తాజా సర్వే స్పష్టం చేసింది. మహిళలకు స్మార్ట్ఫోన్ల దుష్ప్రభావం మరింత అధికమని పరిశోధన వెల్లడించింది. అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని సేపియన్ ల్యాబ్స్ ఈ సర్వే నిర్వహించింది. ఈ సంస్ధ ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 40 దేశాల నుంచి 27,969 మంది డేటాను సమీకరించింది. వీరిలో 4000 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఆరేండ్ల నుంచే స్మార్ట్ఫోన్లు కలిగిఉన్న పిల్లల్లో అధికంగా ఆత్మహత్య ఆలోచనలు రేకెత్తుతున్నాయని పరిశోధనలో గుర్తించారు.
ఆలస్యంగా స్మార్ట్ఫోన్లు యాక్సెస్ చేసే వారితో పోలిస్తే ఆరేండ్లకే స్మార్ట్ఫోన్ను సొంతం చేసుకున్న వారిలో దుందుడుకు స్వభావం అధికంగా ఉన్నట్టు తేలింది. ఆరేండ్ల వయసులోనే మొబైల్ ఫోన్లు కలిగిన ఆడపిల్లల్లో ఇతరులతో పోలిస్తే మాససిక ఆరోగ్య సమస్యలు అధికంగా వేధిస్తున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. ఎంత తక్కువ వయసులో మొబైల్ ఫోన్లను పిల్లలు వాడితే ఆపై మానసిక సమస్యలు అధికంగా చుట్టుముడుతాయని గుర్తించారు.
పురుషుల్లో ఆరేండ్లకే స్మార్ట్ఫోన్లు వాడితే వారిలో 42 శాతం మంది మానసిక అశాంతిని ఎదుర్కొంటుండగా 18 ఏండ్లకు స్మార్ట్ఫోన్ను కలిగిఉన్నవారిలో మానసిక అలజడిని ఎదుర్కొనేవారు 36 శాతంగా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. చిన్న పిల్లలకు ఎంత ఆలస్యంగా స్మార్ట్ఫోన్లు ఇస్తే వారి మానసిక ఆరోగ్యానికి అంత మేలు చేసిన వారవుతారని ఈ అధ్యయన వివరాలు తల్లితండ్రులను హెచ్చరిస్తున్నాయి. పిల్లల సామాజికార్ధిక ఎదుగుదలతో పాటు ఫోన్లతో వారు కోల్పోయిన భౌతిక అంశాలు, సమస్యలను ఎదుర్కొనే శక్తిపైనా పేరెంట్స్ దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More
కేర్ గివర్..ఆరోగ్యం జాగ్రత్త!