న్యూఢిల్లీ: మూత్రపిండాల వ్యాధితో బాధ పడుతూ అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులకు శుభవార్త. ఇక నుంచి వారు తమ శరీరానికి సరిపడే కిడ్నీల కోసం నెలలు, సంవత్సరాలు తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. కిడ్నీ మార్పిడిలో శాస్త్రవేత్తలు అనూహ్య పురోగతి సాధించారు. దీని ప్రకారం ఇక నుంచి ఏ కిడ్నీని ఏ రోగికైనా అమర్చవచ్చు. వారు తమ పరిశోధన ద్వారా ‘ఏ’ రకం మూత్ర పిండాన్ని ‘ఓ’ రకం సార్వత్రిక దాత మూత్రపిండంగా మార్చారు. కొన్ని ఎంజైమ్లు ఎక్కించడం ద్వారా అందులోని నిర్దిష్ట యాంటిజెన్లను తొలగించారు. అంటే ఏ రకం మూత్రపిండాన్ని అయినా సార్వత్రిక దాత మూత్రపిండం (‘ఓ’ రకం)గా మార్చడానికి శాస్త్రవేత్తలు ఒక మార్గాన్ని కనుగొన్నారు.
రకంతోనే తంటా అంతా..
సాధారణంగా ఇప్పటివరకు మూత్రపిండాల మార్పిడిలో ప్రధాన అవరోధంగా ఉన్న అంశం రక్తం రకం సరిపోలిక. ఇది సరిపోకపోతే రోగికి కిడ్నీ మార్పిడి అసాధ్యం. దీంతో తమకు సరిపడే కిడ్నీ కోసం రోగి నెలలు, సంవత్సరాలు తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఉంది. ఒక్క అమెరికాలోనే వేచి చూస్తున్న రోగుల సంఖ్య 90 వేలకు పైగా ఉంది. వీరిలో చాలామంది రోగులది ‘ఓ’ రకం రక్తం. అంటే వారు దీర్ఘకాలం పాటు వేచి ఉండక తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా సార్వత్రిక దాత మూత్రపిండ సృష్టి ద్వారా రోగులు వేచి చూడాల్సిన అవసరం ఉండదు.