రోహ్తక్ : మన దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానాలోని రోహ్తక్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఖట్టర్ మాట్లాడుతూ.. నెహ్రూ కాకతాళీయంగా, తలవని తలంపుగా ప్రధాని అయ్యారన్నారు. ఆ పదవికి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, అంబేద్కర్ అర్హులని చెప్పారు. రాజ్యాంగం మన పవిత్ర గ్రంథమని, దానిని రూపొందించడం కోసం అంబేద్కర్ చేసిన కృషిని మనం నిరంతరం గుర్తుంచుకోవాలని చెప్పారు. అంబేద్కర్ కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు.
ఆయన మరణానంతరం అంత్యక్రియలకు ఢిల్లీలో అప్పటి కాంగ్రెస్ సర్కారు స్థలం ఇవ్వలేదని తెలిపారు. బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అంబేద్కర్‌కు సంబంధించిన ఐదు ప్రదేశాలను గుర్తించి, అభివృద్ధి చేసిందన్నారు. ఖట్టర్ వ్యాఖ్యలపై హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపిందర్ హుడా స్పందించారు. అనుకోని విధంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.