న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: రాజ్యసభలో ప్రసంగిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహనాన్ని కోల్పోయి బీజేపీ ఎంపీ నీరజ్ శేఖర్‌పై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు ఖర్గే బుధవారం రాజ్యసభలో ప్రసంగిస్తుండగా మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడైన నీరజ్ శేఖర్ అడ్డుపడినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. తన ప్రసంగానికి అడ్డుపడిన నీరజ్‌ను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ, ‘మీ నాన్న నేను సహచరులం. నువ్వేం మాట్లాడతావు? నిన్ను ఎత్తుకుని తిప్పాను. నోర్మూసుకుని కూర్చో’ అంటూ మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ అమెరికా డాలరుతో రూపాయి మారకం దారుణంగా పడిపోతోందని చెబుతున్న సమయంలో ఈ సంవాదం జరిగింది.