Kharge : అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఇటీవల కీలక సూచనలు చేశారు. మంచి నీళ్లు బాగా తాగాలని, మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వడదెబ్బ తగిలినట్లుగా భావిస్తే నిర్లక్ష్యం వహించకూడదని ప్రధాని జాగ్రత్తలు చెప్పారు. అయితే మోదీ చెప్పిన ఈ జాగ్రత్తలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు (Congress President) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) స్పందించారు. ప్రజలు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలరని, కానీ బీజేపీ ప్రాయోజిత ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేరని అన్నారు.
దేశ ప్రజలకు అధిక ఉష్ణోగ్రతల వలన కంటే ద్రవ్యోల్బణం వలననే చెమటలు ఎక్కువగా పడుతున్నాయని చురక అంటించారు. ప్రజలను బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దోచుకుంటోందని, కానీ దీనిపై ప్రధాని మాట్లాడటం లేదని విమర్శించారు. ప్రజలు ఎండవేడిని తట్టుకోగలరని, కానీ బీజేపీ ప్రాయోజిత ద్రవ్యోల్బణం అనే మంటలవల్ల సామాన్య ప్రజలకు చెమటలు పడుతున్నాయని పేర్కొన్నారు. ‘మీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ గురించి మీరెందుకు మాట్లాడటం లేదు మోదీజీ..?’ అని ఖర్గే తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు.