న్యూఢిల్లీ, అక్టోబర్ 3: చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్-2లో భాగంగా మూడు కారిడార్ (నడవా)లు నిర్మించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. అందులో భాగంగా చెన్నైలో రవాణా సౌకర్యం మరింత మెరుగుకు మూడు కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది. మొత్తం 118.9 కి.మీ పొడవున నిర్మించే ఈ కారిడార్లలో 128 మెట్రో స్టేషన్లు ఉంటాయి. 63,246 కోట్లతో 2027నాటికి వీటిని పూర్తి చేస్తారు. ఈ ఫేజ్-2 మెట్రో పూర్తయితే చెన్నై నగరానికి మొత్తం 173 కి.మీ మెట్రో సౌకర్యం కలుగుతుంది.
దేశంలోని మరో ఐదు భాషలకు ప్రాచీన హోదా లభించింది. మరాఠీ, బెంగాలీ, పాళి, ప్రాకృతం, అస్సామీ భాషలకు ‘శాస్త్రీయ భాష’ హోదా కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ప్రాచీన హోదా లభించిన భాషల సంఖ్య ఆరు నుంచి 11కు పెరిగింది. అంతకుముందు తెలుగు, తమిళం, సంస్కృతం, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు మాత్రమే ఈ హోదా ఉండేది.
దేశంలోని అన్నదాతల కోసం రెండు పథకాలను గురువారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రూ. లక్ష కోట్లతో సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రత లక్ష్యాలతో పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి యోజన పథకాలకు 1,01,321.61 కోట్లను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ‘వంట నూనెలు- నూనె గింజలు’ మిషన్ కోసం రూ.10,103 కోట్లను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు మన దేశీయ అవసరాలు తీర్చేందుకు 50 శాతం పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. రానున్న ఏడేండ్లలో నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.