వారణాసి, సెప్టెంబర్ 12: దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవుళ్ల విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్‌పై విచారణ కొనసాగింపునకు అంగీకరించింది. ఈ మేరకు సోమవారం జిల్లా న్యాయమూర్తి ఏకే విశ్వేష్ కీలక నిర్ణయం వెల్లడించారు. శృంగార గౌరీ విగ్రహానికి పూజలు చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్ విచారణార్హం కాదని, మసీదు ప్రాంగణమంతా వక్ఫ్ బోర్డు ఆస్తి అని అంజుమన్ ఇంతజామియా మసీదు కమిటీ వాదించింది. ఆ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ‘చర్చలు, పరిశీలనల అనంతరం నేనొక నిర్ణయానికి వచ్చా. ప్రార్థనా స్థలాలు (ప్రత్యేక నిబంధన) చట్టం-1991 ప్రకారం పూజలు నిర్వహించుకోకుండా పిటిషన్‌దారులను నిషేధించలేం’ అని 26 పేజీలతో కూడిన ఆర్డర్‌ను జారీ చేశారు. అనంతరం కేసును ఈ నెల 22కు వాయిదా వేశారు. అటు.. తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వారణాసిలో సెక్షన్ 144ను అమలు చేశారు. తీర్పు సందర్భంగా కోర్టులోకి 32 మందికి మాత్రమే అనుమతిచ్చారు. ఇదిలా ఉండగా, వారణాసి కోర్టు నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్తామని ముస్లిం వర్గాల తరఫు న్యాయవాది మెరాజుద్దీన్ సిద్దీఖీ వెల్లడించారు. కాగా, 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం.. 1947, ఆగస్టు 15నాటికి ప్రార్థనా స్థలాలు ఏ స్థితిలో ఉన్నాయో అలాగే కొనసాగించాలి. వాటిలో మార్పుచేర్పులు చేయరాదు.
28న హైకోర్టు విచారణ
జ్ఞనవాపి మసీదు కేసులో 1991లో దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు ఈ నెల 28న విచారణ చేపట్టనున్నది. మసీదు ఉన్న స్థలంలో ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయాన్ని పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌దారులు కోరారు. మసీదు స్థలం కూడా ఆలయానికి సంబంధించినదేనని అందులో పేర్కొన్నారు.
దేశంలో కొత్త సమస్యలకు ఆజ్యం : ఒవైసీ
వారణాసి కోర్టు నిర్ణయంపై మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలతో దేశంలో అస్థిరత ఏర్పడుతుందని, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని హెచ్చరించారు. వారణాసి కేసు కూడా బాబ్రీ మసీదు తీర్పులా తయారవుతుందని వెల్లడించారు. ఈ ఆర్డర్ తర్వాత ప్రార్థనా స్థలాల చట్టం-1991 ఉద్దేశం నీరుగారిపోతుందని వ్యాఖ్యానించారు. పరిస్థితులు మళ్లీ 1980ల్లోకి వెళ్తున్నాయని, అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వారణాసి కోర్టు ఆర్డర్‌పై మసీదు కమిటీ పైకోర్టుకు వెళ్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
1991లోనే పిటిషన్
కాశీ విశ్వనాథుని ఆలయంలో కొంత భాగాన్ని ఔరంగజేబు ఆదేశాలతో 17వ శతాబ్దంలో కూల్చి, జ్ఞానవాపి మసీదును నిర్మించారని 1991లో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారానికి సంబంధించి పలు కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసు విచారణ సందర్భంగా అప్పటి సివిల్ జడ్జి రవి కుమార్ దివాకర్.. జ్ఞానవాపి కేసులో సర్వే ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం మసీదు ప్రాంగణాన్ని పరిశీలించిన భారత పురావస్తు బృందం.. 2022 మే 14, 15, 16 తేదీల్లో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించి మసీదు వాజుఖానాలో శివలింగం ఉన్నట్టు వెల్లడించింది. దీంతో ఆ ప్రాంతాన్ని సీల్ వేయాలని కోర్టు మే 16న జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. మే 20న ఆ కేసును జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకొన్నది.