న్యూఢిల్లీ : పుణెకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఆయన తల్లి రాఖీ అగర్వాల్ ప్రధాని మోదీకి కన్నీటితో లేఖ రాశారు. తన కుమారుడి మరణంతో తమ ప్రపంచం శూన్యమైందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, ఈ కేసులో సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని ప్రధానిని వేడుకున్నారు. గత నెల 18న 26 ఏండ్ల కేతన్ అగర్వాల్‌ను లోహగఢ్ కోటపై నుంచి తోసి హత్య చేసిన ఉదంతం దేశంలో సంచలనం సృష్టించింది.
కేతన్కు కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఈ దురాగతానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రధాని మోదీకి పంపిన ఈమెయిల్లో రాఖీ అగర్వాల్ తన మనోవేదనను పంచుకున్నారు. ‘పెండ్లి చేసుకొని మా కండ్ల ముందు ఉంటాడనుకున్న బిడ్డకు నేనే అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. మనవడి (కేతన్) మరణాన్ని తట్టుకోలేక తాత గుండెపోటుతో కన్నుమూసిన విషయాన్ని లేఖలో ఆమె ప్రస్తావించారు.