కొచ్చి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతాపార్టీ (BJP) ఘోర పరాజయం పాలవడంపై ప్రముఖ రచయిత్రి, ఉద్యమకారిణి అరుంధతీరాయ్ సంతోషం వ్యక్తం చేశారు. కేరళలోని కొచ్చి నగరంలో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) ఆధ్వర్యంలో జరిగిన యువధార యూత్ లిటరేచర్ ఫెస్టివల్లో అరుంధతీ రాయ్ ప్రసంగిస్తూ.. కర్ణాటకలో బీజేపీ ఓటమి వార్త తనకు చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు. సంతోషంతో ఆ రోజు రాత్రంతా తాను నిద్ర కూడా పోలేదని ఆమె చెప్పారు.
గతంలో కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే మా వదిన తనకు ఓ మెస్సేజ్ పంపిందని, ఆ మెస్సేజ్‌లో ‘బీజేపీ ఈక్వల్స్ టు ఆనముత్త’ అని రాసి ఉందని, ఆనముత్త అంటే ‘పేద్ద సున్నా’ అని అర్థమని తన ప్రసంగంలో అరుంధతీరాయ్ ప్రస్తావించారు. మనం తప్పనిసరిగా ఆ ఆనముత్తను అలాగే ఉంచాలని యువతకు సూచించారు. కేరళ ఒక్కటే బీజేపీకి వ్యతిరేకంగా నిలువాలని తాను కోరుకోవడం లేదని, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవాలన్నదే తన కోరిక అని ఆమె చెప్పారు.
గత ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్రమోదీ కేరళ పర్యటనకు వచ్చినప్పుడు కొన్ని క్రిస్టియన్ సంఘాలు ఆయనకు ఘన స్వాగతం పలుకడం తనను బాధించిందని అరుంధతీరాయ్ చెప్పారు. మణిపూర్‌లో, కేరళలో, జార్ఖండ్‌లో ఏం జరుగుతుంతో చూసి కూడా ప్రధానికి స్వాగతం పలికేందుకు కొందరు ఆరాటపడటం తనను విస్తుపోయేలా చేసిందని అన్నారు. గత రెండేళ్లలో దేశంలో 300 క్రిస్టియన్ చర్చిలపై దాడులు జరిగాయని ఆమె గుర్తుచేశారు.
ఇప్పటికైనా క్రిస్టియన్ గ్రూప్స్ పునరాలోచన చేయాలని, బీజేపీకి కేరళలో ఏ మాత్రం చోటు ఇవ్వకూడదని రాయ్ చెప్పారు. ఒకవేళ బీజేపీకి చోటిచ్చామంటే కేరళ మాడి మసైపోవడం ఖాయమని ఆమె హెచ్చరించారు. కేరళలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి చోటు దొరకనివ్వొద్దని క్రిస్టియన్ గ్రూప్స్‌కు అరుంధతీరాయ్ సూచించారు.