తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం వద్ద ప్రతిపక్ష ఎమ్మెల్యేలు (Kerala UDF MLAs) బైఠాయించారు. రాష్ట్రంలో మహిళల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంపై నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన మార్షల్స్, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను స్పీకర్ కార్యాలయం నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు గాయపడ్డారు. రాష్ట్రంలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడిని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఎమ్మెల్యేలు ఖండించారు. ఈ నేపథ్యంలో కేరళలో మహిళల భద్రతపై చర్చించేందుకు బుధవారం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఏఎన్ షంషీర్ తిరస్కరించారు. అలాగే కొచ్చి డంపింగ్ యార్డ్ అగ్ని ప్రమాదంపై నిరసన చేస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్లపై పోలీసుల చర్యను చర్చించేందుకు ముందు రోజు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా స్పీకర్ తిరస్కరించారు.
కాగా, తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ వరుసగా తిరస్కరించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శించారు. అనంతరం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. అయితే మార్షల్స్ వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.
మరోవైపు అసెంబ్లీ భ్రదతా సిబ్బంది తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సీనియర్ శాసనసభ్యుడు, మాజీ హోంమంత్రి తిరువంచూర్ రాధాకృష్ణన్‌ను మార్షల్స్ నెట్టారని, మహిళా ఎమ్మెల్యే రెమ చేతిని మహిళా మార్షల్స్ మెలిపెట్టి తిప్పి లాగారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. ఎమ్మెల్యేలు రెమ, ఏకేఎం అష్రఫ్, టీవీ ఇబ్రహీం, సనీష్ కుమార్ గాయపడినట్లు తెలిపారు.
సీఎం విజయన్ ఒత్తిడి మేరకు స్పీకర్ షంషీర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశన్ ఆరోపించారు. తమ ప్రశ్నలకు ముఖ్యమంత్రి భయపడుతున్నారని, అందుకే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను త్వరగా ముగించాలని ఆయన భావిస్తున్నారని విమర్శించారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ లాక్కెళ్తున్న వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Video: Kerala MLAs Forcibly Lifted, Removed To Break Up Assembly Protest https://t.co/xTdhCwPbdx pic.twitter.com/V15E0NTbKJ
— NDTV (@ndtv) March 15, 2023