తిరువనంతపురం: మోనాలిసా(Mona Lisa) అందం అందరికీ తెలిసిందే. లియోనార్డో డా విన్సీ గీసిన ఆ కళాఖండం ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నది. అయితే లెజెండరీ పేయింటర్ వేసిన ఆ పోట్రేయిట్ను ఇప్పుడు కేరళ సర్కారు తమ ప్రమోషన్ కోసం వాడుకుంటోంది. కానీ స్మైలీ మోనాలీసా కాస్త కేరళ కుట్టిగా మారింది. బొట్టు.. మల్లెపువ్వులు పెట్టుకున్నది. కేరళ చేనేత కసావు తెల్ల చీర ధరించింది. ఆ చీరకు బంగారు రంగు ఎంబ్రాయిడరీ పట్టీ ఉన్నది. బంగారు ఆభరణాలు కూడా ధరించింది ఆ కేరళ మోనాలిసా.
ఓనమ్ పండుగను ప్రమోట్ చేసేందుకు కేరళ పర్యాటక శాఖ ఏఐ ద్వారా జనరేట్ చేసిన మోనాలిసా చిత్రాన్ని వాడుకున్నది. కేరళ పడుచు స్టయిల్లో దర్శనమిస్తున్న మోనాలిసా ఫోటోపై విమర్శలు వస్తున్నాయి. కళాకారుడు లియోనార్డో డా విన్సీ బొమ్మను మార్చిన తీరు నైతికతకు వ్యతిరేకమని కొందరంటున్నారు. స్టేట్ ఆఫ్ హార్మనీ క్యాంపేన్ కోసం కేరళ సర్కారు మోనాలిసా ఏఐ పిక్‌ను ప్రచారం చేస్తోంది.
1503 నుంచి 1506 మధ్య కాలంలో లియోనార్డో ఆ కళాఖండాన్ని వేశారు. పారిస్‌లో ఉన్న లవ్రే మ్యూజియంలో ప్రస్తుతం ఆ ఫోటో ఉన్నది. లీసా గెరార్డిని అనే అమ్మాయిని గీసే ప్రయత్నంలో మోనాలిసా ఫోటో పుట్టినట్లు చెబుతుంటారు. లియోనార్డో 1519లో మరణించాడు. అయితే కాపీరైట్ చట్టం వర్తిస్తుందని కొందరు అంటున్నారు. కానీ ఒరిజినల్ కళాకృతిని మార్చడం నేరం అవుతుందని కొందరు వాదిస్తున్నారు.
ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు జరిగే ఓనమ్ ఉత్సవాలను ప్రమోట్ చేసేందుకు ఆ పిక్‌ను వినియోగిస్తున్నామని కేరళ టూరిజం శాఖ తన ప్రకటనలో చెప్పింది.