ఒట్టావా: కెనడాలోని మనిటోబాలో మంగళవారం ఉదయం రెండు విమానాలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు పైలట్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతుల్లో 23 ఏండ్ల కేరళ యువకుడు శ్రీహరి సుకేశ్ ఉన్నారు. ఓ విమాన పాఠశాలకు చెందిన ఒకే ఇంజిన్ ఉన్న రెండు చిన్న విమానాలు ల్యాండింగ్ సమయంలో పరస్పరం ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. శ్రీహరి సొంత ఊరు కొచ్చి అని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్‌లో తెలిపింది. ‘మేం బాధిత కుటుంబం, శిక్షణ పాఠశాల, స్థానిక పోలీసులతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన సహాయం అందిస్తున్నాం’ అని చెప్పింది.
మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు సెస్నా విమానాల్లో టేకాఫ్, ల్యాండింగ్ ప్రాక్టీసింగ్ చేస్తుండగా ఇద్దరూ ఒకే సమయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నించారని హార్వ్స్ ఎయిర్ పైలట్ ట్రైనింగ్ స్కూల్ ప్రెసిడెంట్ అడమ్ పెన్నర్ వెల్లడించారు. అయితే చిన్న రన్ వే మీద కొన్ని వందల యార్డుల దూరంలో రెండు విమానాలు ఒకదానిని ఒకటి ఢీ కొట్టాయని సీబీఎస్ న్యూస్ రిపోర్ట్ చేసింది. రెండు విమానాల్లో రేడియోలు ఉన్నాయని.. అయితే ఇద్దరు విద్యార్థులు ల్యాండింగ్ వేళ ఒకరినొకరు చూసుకోలేదని తెలిపింది. ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారని.. వారి మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పింది.