Ragging | తిరువనంతపురం: తోటి విద్యార్థుల ర్యాగింగ్, బెదిరింపులు తాళలేక తీవ్ర అవమానంతో ఒక బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగుచూసింది. గ్లోబల్ పబ్లిక్స్కూల్లో చదివే 15 ఏండ్ల మిహిర్ ఎర్నాకులం త్రిప్పునితరలోని తన అపార్టుమెంట్ 26వ అంతస్తు నుంచి దూకి ఈ నెల 15న ఆత్మహత్య చేసుకున్నాడు.
తొలుత అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కుటుంబ సభ్యులకు తెలియలేదు. తర్వాత స్నేహితులతో మాట్లాడి, అతడి సామాజిక మాధ్యమ ఖాతాలు పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు బాలుడి తల్లి రజ్నా పీఎం ఈ విషయాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.
తన కుమారుడిని గ్లోబల్ పబ్లిక్ స్కూల్లోని కొంతమంది విద్యార్థుల గ్యాంగ్ తరచూ ర్యాగింగ్ చేసేదని, స్కూల్ బస్‌లో, స్కూల్లో అతడిని ఘోరంగా వేధించి అవమానించేదని ఆమె తెలిపారు. ఆత్మహత్యకు ముందు రోజు తన కుమారుడిని వారు బలవంతంగా వాష్ రూమ్‌లోకి తీసుకెళ్లి టాయిలెట్ సీటును నాకించారని, టాయిలెట్‌ను ఫ్లష్ చేసి అతడి తలను అందులో ముంచారని ఇవన్నీ భరించలేక తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.