తిరువనంతపురం : కేరళలో కరోనా విలయం కొనసాగుతున్నది. నిన్న కాస్త తగ్గిన కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఆదివారం 51,570 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,83,515కు చేరుకుంది. వైరస్‌తో 14 మంది మృతి చెందగా.. మరణాల సంఖ్య 53,666కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. తాజాగా 32,701 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు 55,74,535 మంది డిశ్చార్జి అయ్యారు.
గత 24 గంటల్లో కేరళవ్యాప్తంగా 1,03,366 టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం 50వేలకుపైగా కొత్త కేసులు రికార్డవగా.. అత్యధికంగా ఈ నెల 25న 55,475 కేసులు రికార్డయ్యాయి. గతేడాది మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో కొవిడ్ కేసులు ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కొత్త కేసుల్లో త్రిసూర్‌లో 7,289, తిరువనంతపురంలో 5,746 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,54,595 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.