తిరువనంతపురం: కేరళ పప్పడం అద్భుతమైన రుచే వేరు. దానిని మరిగే నూనెలో వేయగానే ఒక్కసారిగా ఉబ్బి సున్నితమైన బుడగలతో క్షణాల్లో కరకరలాడేలా మారడాన్ని గమనించవచ్చు. అన్నంలో పప్పడం లేనిదే కేరళవాసులకు ముద్ద దిగదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడా పప్పడం ప్రమాదంలో పడిందని అంటున్నారు తయారీదారులు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు కేరళ పప్పడం ప్రత్యేక లక్షణాలను పరిగణనలోకి తీసుకోలేదని తయారీదారులు అంటున్నారు. దేశ వ్యాప్తంగా ఒకే రకమైన ప్రమాణాన్ని వర్తింపచేయడం వల్ల సంప్రదాయ కేరళ పప్పడం తయారీదారులు నష్టపోయే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు.
కేరళ పప్పడం రుచిలో తేడాకు ప్రధాన కారణం తేమ. ఉత్తర భారతం మసాలా పాపడ్, తమిళనాడు, కర్ణాటకల్లో తయారు చేసే అప్పడంలో కన్నా కేరళ పప్పడంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగానే వేడి నూనెలో వేయగానే పప్పడంలో బుడగ ఏర్పడుతుంది, తినగానే కరకరలాడుతుంది. ఎఫ్ఎస్ఏఏఐ నిర్దేశించిన కొత్త ప్రమాణాల ప్రకారం పప్పడంలోని తేమ శాతం 15 శాతం మించి ఉండరాదు. ఒక్కో ప్రాంతానికి అనుగుణంగా, ఆయా ఆహార పదార్ధాల తయారీ ఉంటుందని, దేశమంతటా పాప్పడంలు ఒకే రుచితో తయారు చేయాలనే నిబంధనలు సరికావని, వీటిని తొలగించాలని కేరళ పప్పడం తయారీదారులు కోరుతున్నారు.