న్యూఢిల్లీ: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా(Nimisha Priya)కు.. ఈ నెల 16వ తేదీన యెమెన్‌లో మరణశిక్షను అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. యమెన్ దేశస్థుడిని హత్య చేసిన కేసులో ఆమెకు మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. కేరళలోని పాల్కాడ్ సమీపంలో ఉన్న కొల్లెంగోడే పట్టణానికి చెందిన ఆమెకు గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన యెమెన్ దేశాద్యక్షుడు మరణశిక్షను ఖరారు చేశారు. నిమిషా ప్రియాకు భర్త, కూతురు ఉన్నారు. తొలుత ఆమె యూఏఈలో నర్సుగా పనిచేశారు. ఆ తర్వాత 2011లో యెమెన్‌కు ఆమె వలస వెళ్లింది. అక్కడ యెమెన్ జాతీయుడు తలాల్ అబ్దో మహదితో పరిచయం ఏర్పడింది.
ఆర్థిక కష్టాల నేపథ్యంలో 2014లో ప్రియా భర్త, ఆమె కూతురు ఇండియాకు తిరిగి వచ్చేశారు. ఆ ఏడాదిలోనే యెమెన్‌లో తీవ్ర స్థాయిలో సివిల్ వార్ మొదలైంది. దీంతో కొత్త వీసా రూల్స్ వల్ల కుటుంబసభ్యులు మళ్లీ రాలేకపోయారు. స్థానిక భాగస్వామ్యులతో కలిసి వ్యాపారం చేసే అవకాశం యెమెన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో మహదితో కలిసి ప్రియా రాజధాని సనాలో క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. కొన్నాళ్ల తర్వాత డబ్బు కోసం మహది వేధింపులు మొదలు పెట్టాడు. ఆమె పాస్‌పోర్టును సీజ్ చేశాడు. అతని వేధింపులను ఆమె తట్టుకోలేకపోయింది.
2018లో ట్రయల్ కోర్టు ప్రియాను దోషిగా తేల్చింది. ఓ వ్యక్తి సాయంతో మహదిని ప్రియా హత్య చేసినట్లు కోర్టులో రుజువు చేశారు. దీంతో ఆమెకు మరణశిక్ష విధించారు. ప్రియను రక్షించుకునేందుకు ఆమె పేరెంట్స్ ప్రయత్నించారు. యెమెన్ చట్టాల ప్రకారం ఒకవేళ బాధిత కుటుంబం క్షమాభిక్షకు అంగీకరిస్తే అప్పుడు మరణశిక్షను రద్దు చేసే అవకాశం ఉంటుంది. డబ్బు మార్పిడి ద్వారా ఆ శిక్షను నిలిపివేయవచ్చు.