ముంబై: విమానం గాలిలో ఉండగా సిబ్బందిపై దాడి చేయడంతోపాటు డోర్ తెరిచేందుకు వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. శనివారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం కేరళలోని కోజికోడ్ నుంచి బహ్రెయిన్‌కు టేకాఫ్ అయ్యింది. ఆ విమానంలో ఉన్న కేరళకు చెందిన 25 ఏళ్ల అబ్దుల్ ముసావిర్ నడుకండీ ఒక్కసారిగా మేల్కొన్నాడు. విమానం వెనుక భాగం వైపు వెళ్లాడు. అక్కడున్న క్యాబిన్ సిబ్బందిపై దాడి చేశాడు. విమానం రోడ్ తెరిచేందుకు ప్రయత్నించాడు.
కాగా, విమాన సిబ్బంది అతి కష్టం మీద ఆ ప్రయాణికుడ్ని అతడి సీటు వద్దకు తెచ్చారు. అక్కడ వారితోపాటు మిగతా ప్రయాణికులను అతడు దుర్భాషలాడాడు. అలాగే ఎమర్జెన్సీ డోర్ తెరుస్తానని బెదిరించాడు. ఈ గందరగోళం నేపథ్యంలో భద్రతా ముప్పుగా భావించిన పైలట్ ముంబై విమానాశ్రయం అధికారులను అలెర్ట్ చేశాడు. ఆ విమానం అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాగానే భద్రతా సిబ్బంది ఆ ప్రయాణికుడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.