కొచ్చి : సుప్రసిద్ధ శబరిమల దేవాలయంలోని ద్వారపాలకుల విగ్రహాల బంగారం మాయమవడంపై విజిలెన్స్ దర్యాప్తునకు కేరళ హైకోర్టు గురువారం ఆదేశించింది. ఈ విగ్రహాలకు బంగారు పూత పూయాలని ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు 2019లో నిర్ణయించింది. దీని కోసం స్పెషల్ కమిషనర్ నుంచి కానీ, కోర్టు నుంచి కానీ ముందస్తు అనుమతి తీసుకోలేదు. కనీసం సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వివాదం ప్రారంభమైంది. మొదట్లో ఈ విగ్రహాల బరువు 42.8 కేజీలు ఉండేది.
కానీ చెన్నైలోని ఓ సంస్థకు చేరేసరికి వీటి బరువు 38.258 కేజీలు మాత్రమే ఉంది. అంటే 4.54 కేజీల బంగారం తగ్గిపోయింది. ఇది తీవ్రమైన లోపమని, దీనిపై దర్యాప్తు జరగాలని హైకోర్టు పేర్కొంది. ఈ ద్వారపాలకుల విగ్రహాలను 1999లో అధికారిక అనుమతులతో ఏర్పాటు చేశారు. వీటికి 40 ఏళ్ల వారంటీ ఉన్నప్పటికీ, ఆరేళ్లకే ప్లేట్లలో లోపాలు కనిపించాయి. దీనిపై దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది.