తిరువనంతపురం: పసిబిడ్డను తల్లి నుంచి వేరు చేస్తారా? అంటూ కేరళ హైకోర్టు ఆ రాష్ట్రంలోని ‘చైల్డ్ వెల్ఫేర్ కమిటీ’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పసిబిడ్డకు తల్లి పాలు పట్టడం, ఆ బిడ్డ తల్లి పాలను పొందడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కుకు సంబంధించిన అంశమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
పసిబిడ్డను తల్లికి అప్పగిస్తూ జస్టిస్ వీజీ అరుణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఓ కేసులో శుక్రవారం తీర్పు వెలువరించింది. పసిపాప సంరక్షణను తండ్రికి అప్పగిస్తూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసింది. సీడబ్ల్యూసీ నిర్ణయం వల్ల ఓ పసిబిడ్డ తల్లికి దూరమవ్వటం చాలా బాధాకరమని న్యాయమూర్తి అన్నారు.