కొల్లాం, డిసెంబర్ 18: గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ను తొలగించాలని కేంద్రాన్ని కోరే విషయంపై తమ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని కేరళ సీఎం పినరాయి విజయన్ వెల్లడించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ‘నవ కేరళ సదస్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం కొల్లాంలో పాల్గొన్న సీఎం విజయన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్ ఆరిఫ్ ఖాన్ వ్యవహార శైలిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే గవర్నర్ చర్యలను సరిదిద్దాల్సిన అవసరం ఉన్నదని విజయన్ అభిప్రాయపడ్డారు. కేరళలో శాంతి, సామరస్య పరిస్థితులను ధ్వంసం చేసేందుకు ఖాన్ ప్రయత్నిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తొలగించాలని కేంద్రాన్ని కోరనున్నామని పేర్కొన్నారు.