తిరువనంతపురం: కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావలసిన నిధుల కోసం ఢిల్లీలోనే తేల్చుకోవాలని కేరళ ప్రభుత్వం యోచిస్తున్నది. బకాయిల విడుదల కోసం దేశ రాజధానిలో ధర్నా చేయాలని భావిస్తున్నది. సాధారణ విద్యా శాఖ మంత్రి వీ శివన్ కుట్టి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, 2023-24, 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల కోసం కేంద్ర సాయంగా కేరళకు రూ.440 కోట్లు రావలసి ఉందని తెలిపారు. సాంకేతిక కారణాలను చూపి విద్యా రంగానికి నిధుల విడుదలను నిలిపివేయరాదని వ్యాఖ్యానించారు. రాష్ర్టానికి హక్కుగా రావలసిన నిధులను ఇక ఏమాత్రం జాప్యం చేయకుండా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.