తిరువనంతపురం: కేరళ (Kerala) రాష్ట్రం వాయనాడ్ (Wayanad) జిల్లాలో మనుషులను చంపి అలజడి సృష్టించిన పెద్ద పులి (Tiger) ని చంపేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. శనివారం (డిసెంబర్ 9న) కూడా ఆ పులి ఓ రైతుపై దాడి చేసి చంపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
శనివారం పులి దాడిలో మృతి చెందిన వ్యక్తి కేరళలోని వాయనాడ్‌కు చెందిన 36 ఏళ్ల ప్రజీశ్గా గుర్తించారు. ప్రజీశ్ గడ్డి కోయడానికి వెళ్లిన సమయంలో పులి అతనిపై ఒక్కసారిగా దాడి చేసింది. అతని శరీరంలో కొంతభాగాన్ని తినేసింది. ఆ ఘటన స్థానికంగా తీవ్ర అలజడి రేపింది.
ఈ ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సమస్యను పరిష్కారంపై హామీ ఇచ్చే వరకు మృత దేహాన్ని అక్కడి నుంచి తరలించేది లేదని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే కేరళ అటవీ శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పులిని అంతమొందించాలని ఆదేశాల్లో పేర్కొంది.
అయితే, చంపడానికి ముందు అది మ్యాన్ ఈటర్ అవునా..? కాదా..? అనేది ధ్రువీకరించుకోవాలని సూచించింది. టార్గెట్ చేసిన పులి మ్యాన్ ఈటర్ అని రూఢీ చేసుకున్న తర్వాత దాన్ని బంధించలేకపోతే చంపేయాలని పేర్కొన్నది. దాంతో పులి జాడ గుర్తించేందుకు అటవీ శాఖ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.