న్యూఢిల్లీ, మార్చి 22: కేరళలోని వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ పంపిన ఓ లేఖపై బీజేపీ ముద్ర (సీల్) ఉండటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. బీజేపీ సీల్‌తో ఉన్న ఈసీ లేఖను కేరళ సీపీఎం సోమవారం బహిర్గతం చేసింది. ఈసీ లేఖను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఎన్నికల కమిషన్ ముద్ర ఉండాల్సిన చోట.. బీజేపీ సీల్ ఉండటమేంటని సీపీఎం ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్ అధికారిక లేఖపై బీజేపీ ముద్ర ఉండటం ఈసీ పనితీరుపై పలు సందేహాలు లేవనెత్తుతున్నదని, ఈసీ తటస్థ వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేసింది. ‘భారత ఎన్నికల సంఘం, బీజేపీ.. రెండింటినీ ఒకే అధికార కేంద్రం నియంత్రిస్తున్నట్టు కనిపిస్తున్నది’ సీపీఎం పేర్కొన్నది.
ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదని, సంస్థాగత నిష్పక్షపాత వైఖరిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నదని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వివాదంపై కేరళ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)వివరణ ఇచ్చారు. బీజేపీ సీల్‌తో ఈసీ లేఖ వెలువడటం ఒక ‘క్లరికల్ మిస్టేక్’గా పేర్కొన్నది. ‘2019 మార్గదర్శకాలపై స్పష్టత కోరుతూ కేరళ బీజేపీ తమను సంప్రదించింది. ఈసీ మార్గదర్శకాల పత్రాన్ని ఒక నకలు రూపంలో సమర్పించింది. దీనిపై బీజేపీ ముద్ర కూడా ఉంది. పొరపాటున దీనినే ఇతర పార్టీలకు పంపటం జరిగింది’ అని ఈసీ వివరించింది.