తిరువనంతపురం, సెప్టెంబర్ 29 : కేరళ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఆ రాష్ట్ర శాసనసభ ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. సభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ కేరళ సీఎం పినరయ్ విజయన్ మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా ‘సర్’ను చేపట్టడం ద్వారా మరో మార్గంలో ఎన్ఆర్సీ అమలుజేస్తున్నారన్న ఆందోళనలు ఉన్నాయి.
బీహార్ ఓటర్ల జాబితా సవరణలో అక్కడ బహిష్కరణ రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓటర్ జాబితా నుంచి అన్యాయంగా తొలగింపులు ఉన్నాయి. ఇదేవిధమైన లక్ష్యాలతో జాతీయ స్థాయిలోనూ ‘సర్’ చేపట్టబోతున్నారనే ఆందోళన ఉంది’ అని అన్నారు. పౌరసత్వాన్ని మత ఆధారిత భావనగా మార్చే ప్రయత్నం ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.