Kerala Campaign : కేరళలో ఇన్నాళ్లుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో తెరపడింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. మూడు వారాలకుపైగా హోరాహోరీగా సాగిన రాజకీయ యజ్ఞం ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పోలింగ్‌పై పడింది. ఈనెల 9న జరిగే పోలింగ్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రచారం ముగియడంతో కేరళవ్యాప్తంగా మైకులు మూగబోయాయి. ప్రచారానికి చివరి రోజైన మంగళవారం కేరళ వీధులు పండుగ వాతావరణాన్ని తలపించాయి.
అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్, ఎన్డీఏ కూటములకు చెందిన అభ్యర్థులు, కార్యకర్తలు భారీ రోడ్ షోలు, డప్పు చప్పుళ్లు, ఊరేగింపులతో హోరెత్తించారు. రాష్ట్రంలోని 2.71 కోట్ల మంది ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల బటన్లు నొక్కి తమ తీర్పును నిక్షిప్తం చేయనున్నారు. ఈ ఎన్నికల బరిలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ చారిత్రక విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి కేరళ రాజకీయాల్లో అపూర్వమైన రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు.
అభివృద్ధి నినాదాలతో ఎల్డీఎఫ్ ప్రజల ముందుకు వెళ్లింది. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి మాత్రం గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. వయనాడ్‌లో ప్రచారం చేసిన ప్రియాంక గాంధీ.. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని, సునాయాసంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఈసారి కేరళలో తమ ఉనికిని బలంగా చాటాలని చూస్తోంది.