Adani | న్యూఢిల్లీ: మోదీ ఆప్తమిత్రుడు అదానీకి కెన్యాలో మరో షాక్ తగిలింది. హైవోల్టేజ్ విద్యుత్తు లైన్ల నిర్మాణం, నిర్వహణ కోసం 30 ఏండ్లకు గానూ కెన్యా ప్రభుత్వంతో కుదుర్చుకున్న 736 మిలియన్ డాలర్ల (సుమారు రూ.6,189 కోట్లు) ఒప్పందాన్ని కెన్యా కోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు బ్లూంబర్గ్ ఆదివారం వెల్లడించింది. రాజధాని నైరోబీలోని జోమో కెన్యట్టా విమానాశ్రయాన్ని అదానీ గ్రూపునకు లీజుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు నిరసనకు దిగడంతో ఇదివరకే ఆ ఒప్పందాన్ని అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా విద్యుత్తు ప్రాజెక్టును కోర్టు రద్దు చేయడంతో అదానీ గ్రూప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
పారదర్శకత పాటించలేదు..
కెన్యాలో విద్యుత్తు లైన్ల నిర్మాణం, నిర్వహణ కోసం ఈ నెల ప్రారంభంలో కెన్యా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ (కెట్రాకో)తో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే ఈ ఒప్పందం పారదర్శకంగా లేదని, రాజ్యాంగ నిబంధనలు పాటించలేదని ‘లా సొసైటీ ఆఫ్ కెన్యా’ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లొద్దని, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌తో కొత్తగా ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని అక్కడి హైకోర్టు తాజాగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు కెన్యా ప్రజలకు పిడుగుపాటుగా మారనుందని, విద్యుత్తు చార్జీలు రెట్టింపయ్యే ప్రమాదం ఉన్నదని అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం యూనిట్ చార్జీ కెన్యా కరెన్సీ ప్రకారం ఎస్‌హెచ్ 5.51గా ఉండగా, ఇది రెట్టింపై ఎస్‌హెచ్ 11.14కి చేరుకుంటుందని పేర్కొన్నాయి. ఇది ప్రజలకు నిజంగా విద్యుదాఘాతమేనని, అదానీ సంస్థకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విమానాశ్రయ ప్రాజెక్టు రద్దు
నైరోబీలోని కెన్యట్టా విమానాశ్రయ ఆధునికీకరణ, 30 ఏండ్లపాటు నిర్వహణ కోసం కెన్యా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీతో అదానీ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ విమానాశ్రయ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అదానీ కంటే ఏఎల్జీ అనే స్థానిక సంస్థ మెరుగైన ప్రతిపాదన చేసినప్పటికీ ప్రభుత్వం ఏకపక్షంగా అదానీ సంస్థకు ప్రాజెక్టు కట్టబెట్టిందని విమర్శించాయి. దీంతో ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దుచేసింది. టెండరు ప్రక్రియపై ప్రత్యేక ఆడిట్ జరిపే వరకు అదానీ సంస్థతో తదుపరి ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించింది.
మోదానీ బంధం వల్లే!
అదానీ-మోదీ బంధంపై కెన్యా మాజీ ప్రధాని ఒడింగా ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రధాని మోదీ గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఆ రాష్ట్రంలో ప్రధాని హోదాలో పర్యటించినట్టు ఆయన పేర్కొన్నారు. మోదీ ఆహ్వానం మేరకే తాను, తన సిబ్బంది పర్యటించినట్టు చెప్పారు. అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన పోర్టు, పవర్‌ప్లాంట్, రైల్వేలైన్, ఎయిర్‌స్ట్రిప్ తదితర ప్రాజెక్టులను మోదీ ప్రత్యేకంగా వివరించినట్టు తెలిపారు. దీంతో మోదానీ బంధం మరోసారి బయటపడిందని ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి.
శ్రీలంక లోనూ ఇలాగే
శ్రీలంకలో 500 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అదానీ కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని మోదీ అప్పటి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సపై ఒత్తిడి తెచ్చినట్టు ఆ దేశ విద్యుత్తు సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన ఫెర్డినాండో 2022లో బయటపెట్టారు. పోటీ లేకపోవడంతో అదానీ గ్రూప్‌నకు 25 ఏండ్లలో 4 బిలియన్ అమెరికన్ డాలర్ల అయాచిత లాభం చేకూరుతుందని శ్రీలంక ఇంజినీర్లు తేల్చిచెప్పారు. దీంతో గత ప్రభుత్వ పెద్దలతో అదానీ గ్రూప్ లోపాయికారీ ఒప్పందాలపై పునః సమీక్షించనున్నట్టు శ్రీలంక కొత్త ప్రభుత్వం ప్రకటించింది.