న్యూఢిల్లీ, మార్చి 10: భర్తలు ప్రధాని నరేంద్ర మోదీ పేరు జపిస్తే వారికి రాత్రి భోజనం పెట్టొద్దని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో మహిళా సమ్మాన్ సమారోహ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చాలా మంది మగవాళ్లు మోదీ పేరు జపిస్తున్నారు. వారిని మీరు సరి చేయాలి. మోదీ పేరు జపిస్తే రాత్రి భోజనం పెట్టనని మీ భర్తలకు చెప్పండి’ అని ఆయన అన్నారు.
‘నేను కరెంటు, బస్ ప్రయాణం ఉచితంగా ఇచ్చాను. ఇప్పుడు ప్రతి నెలా మహిళలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నా. బీజేపీ మహిళలకు ఏం చేసిందని వారికి ఓటేయాలి. ఈసారి కేజ్రీవాల్‌కు ఓటేయండి’ అని అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన అతివల జీవితాల్లో నిజమైన సాధికారత తెస్తుందన్నారు.