Assam CM : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై.. అసోం సీఎం హిమాంత బిశ్వశర్మ స్పందించారు. కేజ్రీవాల్‌కు ఆత్మాభిమానం ఉంటే బెయిల్ తీసుకుని ఉండాల్సింది కాదని అన్నారు. కేజ్రీవాల్‌కు సిగ్గులేదని వ్యాఖ్యానించారు.
‘ఆత్మాభిమానం ఉన్న ఎవరైనా అలాంటి బెయిల్‌పై జైలు నుంచి బయటికిరారు. తనకు అలాంటి బెయిల్ వద్దని కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు చెప్పి ఉండాల్సింది. కానీ అతనికి సిగ్గులేదు’ అని హిమాంత బిశ్వశర్మ పరుష వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఉదయం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేశారు. ప్రధాని పార్టీ నిండా దొంగలే ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో హిమాంత బిశ్వశర్మ కేజ్రీవాల్‌ను విమర్శించారు. ఇప్పటికే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడుతున్న కేజ్రీవాల్.. పుండు మీద కారం చల్లినట్లుగా బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.