గువాహటి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌పై అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేజ్రివాల్‌ను తాను అసోంకు ఆహ్వానించాలని ఆయన కోరుకుంటున్నారని, ఇప్పటికే తాను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అసోంకు ఆహ్వానించానని, ఆయనకు కోర్టు నోటీసులు వచ్చాయని, కేజ్రివాల్ కూడా అసోంకు రావాలనుకుంటే రావచ్చని హిమాంత వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
అదేవిధంగా అభివృద్ధి విషయంలో అసోంను ఢిల్లీతో పోల్చి మాట్లాడటంపై కూడా అసోం సీఎం స్పందించారు. ఢిల్లీ మొగలుల కాలం నుంచి దేశ రాజధానిగా ఉన్నదని గుర్తుచేశారు. ఢిల్లీ అభివృద్ధిని గువాహటి, షిల్లాంగ్‌లతో పోల్చడానికి బదులుగా న్యూయార్క్, టోక్యోలతో పోల్చితే బాగుంటుందని సూచించారు.
అసోంకు ఢిల్లీలో ఉన్నన్ని వనరులు అందుబాటులో లేవని, అయినా ఢిల్లీ కేవలం 1200 పాఠశాలలు నడుపుతుంటే తాము 40 వేల పాఠశాలలు నడుపుతున్నామని హిమాంత చెప్పారు. భారతీయ జనతాపార్టీ తమ పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని కేజ్రివాల్ ఆరోపణలు చేస్తున్న సమయంలో అసోం సీఎం పొంతన లేని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.