Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi Liquor case) లో అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆయన జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 25 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ఇవాళ్టితో ముగియడంతో మళ్లీ పొడిగించింది.
తీహార్ జైలు అధికారులు కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కోర్టులోని స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ముందు కేజ్రీవాల్ హాజరయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడం ద్వారా కేజ్రీవాల్ నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యారని సీబీఐ తన తాజా చార్జిషీట్లో ఆరోపించింది. 2021 మార్చిలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నేతృత్వంలో పాలసీని రూపొందించారని, దానికి కేజ్రీవాల్ మద్దతు ఉందని సీబీఐ పేర్కొంది.
అయితే సీబీఐ వాదనలను ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రకటన ద్వారా ఖండించింది. లిక్కర్ స్కామ్ నిజమే అయితే నిందితుల నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఎందుకు రికవరీ చేయలేదని ప్రశ్నించింది. 500 మంది సాక్ష్యులను విచారించి, 50 వేల పేజీల పత్రాలను దాఖలు చేసినప్పటికీ ఒక్క ఆప్ నాయకుడు కూడా అవినీతి చేసినట్లు నిరూపణ కాలేదని పేర్కొంది. కాగా, ఇదే కేసులో ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు సెప్టెంబర్ 11న బెయిల్ మంజూరైంది.
సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేజ్రీవాల్‌తోపాటు దుర్గేష్ పాఠక్‌కు సమన్లు పంపింది. ఈ సమన్లపై స్పందించిన ఎమ్మెల్యే ఇవాళ కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత జూలైలో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది.
అయితే ఈడీ కేసులో సుప్రీంకోర్టు జూలై 12న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో మాత్రం ఇంకా జైల్లోనే కొనసాగుతున్నారు. ఆగస్టు 27, సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 11 వరకు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ గడువు పొడిగించారు. తాజాగా మరోసారి గడువు పొడగింపుతో కేజ్రీకి నిరాశే మిగిలింది. ఈ కేసులో ఇప్పటికే మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత తదితరులు బెయిల్‌పై బయటకి వచ్చారు.