న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్(KC Venugopal) ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంట్‌కు ప్రివిలేజ్ నోటీసు జారీ చేశారు. ఏప్రిల్ 18వ తేదీన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన విపక్షాలను తప్పుపట్టారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు విపక్షాల వల్లే వీగిపోయిందని, దీని వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లుకు క్లియరెన్స్ దక్కలేదని ప్రధాని తన ప్రసంగంలో ఆరోపించారు. అయితే ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని.. కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ తప్పుపట్టారు. మోదీ తన టీవీ ప్రసంగంలో విపక్షాలను తప్పుపట్టడం అనైతికమని, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అవుతుందని ఆయన ఆరోపించారు. బిల్లు వీగిపోవడానికి కారణం విపక్షాలు అని చెప్పడం సభాహక్కుల ఉల్లంఘన అవుతుందని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.
పార్లమెంట్లో మెజారిటీ సాధించకపోవడానికి విపక్షాలు కారణమని ప్రధాని పేర్కొనడం శోచనీయమన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని విపక్షాలు కోరుతున్నాయని, కానీ ప్రభుత్వం తెచ్చిన డీలిమిటేషన్ బిల్లును మాత్రమే తాము వ్యతిరేకించినట్లు వేణుగోపాల్ తెలిపారు. 2023 నాటి మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని విపక్షాలు కోరినట్లు ఆయన చెప్పారు. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని విపక్షాలు కోరాయని, కానీ ప్రభుత్వం మాత్రం విపక్షాలను తప్పుపటి ప్రధాని సభహక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు కాంగ్రెస్ నేత తెలిపారు.
పార్లమెంట్ విధుల ప్రకారం తాము ఓటింగ్‌లో పాల్గొన్నామని, కానీ ప్రభుత్వం తమ బిల్లు ఓడిపోవడానికి విపక్షాలు కారణమని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని, రాజ్యాంగంలోని 105వ అధికరణ ప్రకారం ఓటు వేసిన సభ్యులకు ఎటువంటి కారణాలను ఆపాదించరాదు అని వేణుగోపాల్ అన్నారు. ప్రధానితో సహా ఎవరికైనా ఆ ఆర్టికల్ వర్తిస్తుందన్నారు. ఎన్నికైన ప్రతినిధి తన విధులను నిర్వర్తిస్తుంటే .. వారిని తప్పుపట్టడం వ్యక్తిగత దాడి అవుతుందని, అంతేకాదు పార్లమెంట్ వ్యవస్థను ధిక్కరించడం అవుతుందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసినట్లు అవుతుందని కాంగ్రెస్ నేత తన నోటీసులో తెలిపారు.