Kerala CM : ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమిని ఓడించిన యూడీఎఫ్.. అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎం అవుతారు. అయితే, కేరళం నూతన సీఎం ఎవరు అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం పదవి కోసం అనేకమంది పేర్లను పరిశీలించిన అధిష్టానం చివరకు ఇద్దరి పేర్లను ఫైనల్ లిస్టుకు ఎంపిక చేసింది.
వారు ఒకరు కేసీ వేణుగోపాలు. రెండోది రమేష్ చెన్నితల. ఇద్దరూ నాయర్ తెగకు చెందినవారే. వీరిలో కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీలో, జాతీయ స్థాయిలో కీలక నేతగా, పార్టీ జనరల్ సెక్రెటరీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కేరళంలోని అలప్పు నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. కేరళంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో అభ్యర్థి రమేష్ చెన్నితల కేరళ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నారు. అంతకుముందు కేరళంలో హోం మినిస్టర్‌గా, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. గతంలో కేరళ కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షుడిగా కూడా పని చేశారు. నాలుగుసార్లు ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర కాంగ్రెస్ విభాగానికి పరిశీలకుడిగా ఉన్నారు.
కేసీ వేణుగోపాల్, రమేష్.. ఇద్దరిలో ఒకరు కేరళం నూతన సీఎంగా ఎంపికవుతారు. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేల నుంచి పార్టీ అధిష్టానం అభిప్రాయాలు సేకరిస్తోంది. ఏఐసీసీ పరిశీలకులు తగిన వివరాలు సేకరిస్తున్నారు. ఆదివారం ఈ అంశంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కేరళంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి 102 సీట్లు గెలుచుకుంది. అందులో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 63 సీట్లు సాధించింది.