KC Tyagi : లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎవరి పేరును ప్రతిపాదిస్తే వారికే తాము మద్దతిస్తామని జేడీయూ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ సర్కారులో తాము, టీడీపీ భాగస్వాములుగా ఉన్నామని, కాబట్టి లోక్సభ స్పీకర్గా బీజేపీ ప్రతిపాదించే అభ్యర్థికే తాము మద్దతిస్తామని త్యాగి తెలిపారు.
‘జేడీయూ, టీడీపీ ఎన్డీఏ కూటమిలో బలమైన భాగస్వామ్య పార్టీలు. లోక్సభ స్పీకర్గా బీజేపీ బలపర్చిన అభ్యర్థికే తాము మద్దతు తెలుపుతాం.’ అని త్యాగి చెప్పారు. కొత్త లోక్సభ స్పీకర్ను మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూల నుంచే నియమిస్తారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని.. మీడియా ప్రతినిధులు కేసీ త్యాగి ముందు ప్రస్తావించగా ఆయన పైవిధంగా స్పందించారు.
అయితే కేసీ త్యాగి వ్యాఖ్యలతో లోక్సభ స్పీకర్ పదవిని బీజేపీ ఎంపీకే ఇస్తారనే విషయం స్పష్టమవుతోంది. మిత్రపక్షాలైన టీడీపీకి, జేడీయూకు లోక్సభ స్పీకర్ పదవి దక్కే అవకాశం లేదని అర్థమవుతోంది. కాగా, 18వ లోక్సభ తొలి సమావేశాల్లో భాగంగా ఈ నెల 26న లోక్సభ స్పీకర్ను ఎన్నుకోనున్నారు.