కాట్రా: శ్రీనగర్ నుంచి కాట్రాకు ఇవాళ వందేభారత్ రైలు(Vande Bharat Express)ను స్టార్ట్ చేశారు. అయితే హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే వాతావరణాన్ని తట్టుకునే రీతిలో ఆ రైలు బోగీలను తయారు చేశారు. వాటర్ ట్యాంకులు, బయోటాయిలెట్ల కింద సిలికాన్ హీటింగ్ ప్యాడ్లను అమర్చారు. దీని వల్ల ఫ్రీజింగ్‌ను అడ్డుకోవచ్చు. ఇక మైనస్ ఉష్ణోగ్రతల్లోనూ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండే రీతిలో కశ్మీర్ వందేభారత్ రైలును ఇంజినీర్లు సృష్టించారు. చిత్రవిచిత్రంగా ఉండే అక్కడి ఉష్ణోగ్రతలకు తగిన రీతిలో ఈ రైలును డిజైన్ చేశారు. శీతాకాలంలో ఇక్కడ ఉండే వెదర్ వల్ల తీవ్ర సమస్యలు వస్తాయి. అయితే ఆ వెదర్‌కు తగినట్లు కూడా రైలు నిర్మాణం చేపట్టారు.
మిగితా వందేభారత్ రైళ్ల తరహాలో స్లీక్ డిజైన్, హై స్పీడ్, మాడ్రన్ వసతులు అన్నీ దీంట్లో ఉన్నాయి. కానీ కశ్మీర్ ఎడిషన్ రైలుకు ప్రత్యేకమైన లక్షణాలు కూడా ఉన్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇంజినీర్లు .. కోల్డ్ క్లైమేట్ టెక్నాలజీతో ఈ కొత్త రైలును తయారు చేశారు. ఉష్ణోగ్రతలు మైనస్‌లో ఉన్నా.. రైలుకు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా ఉండే రీతిలో తీర్చిదిద్దారు. వాటర్ ట్యాంకులు, బయో టాయిలెట్ల కింద సిలికాన్ హీటింగ్ ప్యాడ్లు ఈ రైలులో ప్రత్యేకమైనవి. ఓవర్‌హీట్ ప్రొటెక్షన్ సెన్సార్లతో ఈ ప్యాడ్లను తయారు చేశారు. సేఫ్టీ లేయర్ అదనంగా ఉంటుందని ఓ అధికారి తెలిపారు.
అతిశీతల వాతావరణానికి తగినట్లు ప్లంబింగ్ వ్యవస్థను రూపొందించారు. ట్రైన్ ఆగి ఉన్నప్పుడు ఐస్ గడ్డకట్టకుండా ఉండేందుకు సెల్ఫ్ రెగ్యులేటింగ్ హీట్ పైప్లైన్లు, ఆటో డ్రెయిన్ మెకానిజం ఏర్పాటు చేశారు. ఇండియన్ స్టయిల్ టాయిలెట్లకు హీటింగ్ సదుపాయాన్ని కల్పించారు. రైలంతా వేడి వాతావరణం ఉంచేందుకు శౌచాలయాలకు కూడా హెచ్‌వీఏసీ డాక్టులను పొడిగించారు. డ్రైవర్ వద్ద ఉండే ఫ్రంట్ విండ్‌షీల్డ్‌కు కూడా హీటింగ్ పరికరాలను జోడించారు. మంచు పడినా.. తేమ ఉన్నా.. విజిబులిటీ స్పష్టంగా ఉండాలన్న ఉద్దేశంతో వాటిని ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ వ్యవస్థను పూర్తిగా ఫంక్షనల్‌గా ఉంచేందుకు హీటెడ్ ఎయిర్ డ్రయర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఫ్రీజింగ్ వెదర్‌ను తట్టుకునేందుకు 5కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఇన్స్టాల్ చేశారు. భారతీయ ఇంజినీర్ల పనితనానికి కశ్మీర్ వేరియంట్ వందేభారత్ రైలు ప్రత్యేక గుర్తుగా నిలువనున్నది.