Supreme Court | తమిళ నటుడు, టీవీకే పార్టీ నేత విజయ్ కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు రిజిస్టార్ జనరల్ పంపిన నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించారు. ‘ఈ ఘటనలో మద్రాస్ హైకోర్టు డీల్ చేసిన విధానంలో ఎక్కడో లోపం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ నివేదికను పార్టీల న్యాయవాదులతో పంచుకోవాలని ఆదేశాలు జారీ చేసి.. స్పందన చెప్పాలని కోరింది.
సెప్టెంబర్ 27న తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ టీవీకే ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారించింది. అయితే, మద్రాస్ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకున్న విధానంపై సుప్రీం ప్రశ్నలు లేవనెత్తింది. కరూర్ ప్రాంతం మధురై బెంచ్ పరిధిలోకి వస్తుందని.. చెన్నై హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర పోలీస్ అధికారులతో కూడిన సిట్ ఏర్పాటుకు ఎలా ఆదేశిస్తుందని ప్రశ్నించింది. అక్టోబర్ 13న సీబీఐ దర్యాప్తు కోసం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులో చెన్నై బెంచ్ ఈ కేసును ఎలా నిర్వహించిందో చెప్పాలంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి సుప్రీంకోర్టు నివేదిక కోరింది.
రిజిస్ట్రార్ జనరల్ నివేదికను గురువారం అధ్యయనం చేసిన తర్వాత జస్టిస్ మహేశ్వరి ధర్మాసనం ‘హైకోర్టులో ఏదో తప్పు జరుగుతోందని.. హైకోర్టులో జరుగుతుంది సరైంది కాదు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది పీ విల్సన్ వాదనలు వినిపిస్తూ.. ‘ఈ సమస్యకు సంబంధించి హైకోర్టు దేనిపైనా ఆదేశాలు జారీ చేస్తుంది’ అని తెలిపారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన తీర్పులోని 33వ పేరాలో ‘స్థానిక’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని సవాల్ చేశారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ పర్యవేక్షించాలని అక్టోబర్ 13న సర్వోన్నత న్యాయస్థానం ఈ కమిటీలో తమిళనాడుకు స్థానికులు కాని ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను జస్టిస్ రస్తోగి ఎంచుకోవాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.
స్థానికేతరులు అన్న పదం తమిళనాడులో రాజకీయంగా దుమారం రేపింది. ఈ అంశంపై మరోసారి ఆలోచించాలని.. లేదంటే ఉత్తర్వులనైనా మార్చాలని విల్సన్ చేసిన అభ్యర్థను కోర్టు తోసిపుచ్చింది. తీర్పును సవరించేందుకు ధర్మాసనం నిరాకరించింది. కేకే రమహేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సైతం నోటీసులు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది విల్సన్ రాష్ట్ర కమిషన్ సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోదని, అలాంటి సంఘటనలను నివారించడానికి సిఫార్సులు చేయడానికి మాత్రమే పరిమితం అవుతుందని హామీ ఇచ్చారు.