Karnataka | కర్నాటక కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రిని మారుస్తారని.. శివకుమార్‌కు సీఎంగా అవకాశం దగ్గబోతుందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో కర్నాటకలో రాజకీయాలు వేడెక్కాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు అత్యంత సన్నిహితుగా పేరున్న ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. డీకే రాబోయే రెండు, మూడు నెలల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభిస్తుందని తెలిపారు. సెప్టెంబర్ తర్వాత రాష్ట్రంలో ‘విప్లవాత్మక’ రాజకీయ పరిణామాలుంటాయన్న సహకార మంత్రి కేఎన్ రాజన్న ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తాజాగా ఇక్బాల్ మాట్లాడుతూ ‘ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన (కాంగ్రెస్) బలం ఏంటో మీ అందరికీ తెలుసు. విజయం సాధించడానికి ఎవరు పోరాటం, కృషి చేశారో.. తన శక్తిని ధారపోశారో అందరికీ తెలుసు, ఆయన (డీకే) వ్యూహం, ఆయన పనులన్నీ చరిత్రగా మారాయన్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? అని రామనగరంలో విలేకరులు ప్రశ్నించగా.. తాను ఊహాగానాలు నమ్మనని.. హైకమాండ్ పరిస్థితి గురించి తెలుసుకుని సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుని ఆయనకు అవకాశం ఇస్తుందనే పూర్తి నమ్మకం ఉందన్నారు. సెప్టెంబర్ తర్వాత విప్లవాత్మక రాజకీయ పరిణామాలుంటాయని నేతలు మాట్లాడుతున్నది దీని గురించేనని.. రెండు, మూడు నెలల్లో నిర్ణయం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనయుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య ముఖ్యమంత్రి మార్పును కేవలం ఊహాగానాలు మాత్రమేనంటూ తోసిపుచ్చారు.
దీనిపై ప్రశ్నించగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని హుస్సేన్ పేర్కొన్నారు. అప్పుడు అందరం ఢిల్లీలో ఉన్నామని.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నిర్ణయం తీసుకున్న నిర్ణయం అందరికీ తెలుసునన్నారు. వారంతా మళ్లీ నిర్ణయం తీసుకుంటారని, మనం వేచి చూడాలన్నారు. సిద్ధరామయ్య, శివకుమార్ ఒప్పందం నేపథ్యంలో కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు జరుగుతుందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరు నేతలు చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉంటారని ఒప్పందం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.