Karnataka | బెంగళూరు, జనవరి 14: విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న మరో ఘటన తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. కలబురగిలోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులతోనే టాయిలెట్లు శుభ్రం చేయించడమే కాక, తన ఇంట్లోని తోట పనిని కూడా వారిచేత చేయించడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. డైరెక్టరేట్ ఆఫ్ మైనారిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మౌలానా ఆజాద్ మోడల్ స్కూల్స్‌లోని ఒక దానిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
ప్రిన్సిపాల్ చేస్తున్న చర్యపై తాము నిలదీయగా, క్లీనింగ్ సిబ్బంది తక్కువగా ఉండటం వల్లే తానీ పని చేస్తున్నట్టు ప్రిన్సిపాల్ చెప్పారని, ఆమె గత ఏడాదిగా విద్యార్థులతో ఈ పని చేయిస్తున్నదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల ఇలాంటి ఘటనలే కర్ణాటకలో రెండు వెలుగు చూశాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.