బెంగళూరు : కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న హనీ ట్రాపింగ్ కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వం మెడకు చుట్టుకోనున్నది. తనపై కూడా హనీ ట్రాప్ ప్రయత్నం జరిగిందంటూ స్వయంగా రాష్ట్ర మంత్రి అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ కుంభకోణం వెనుక ప్రభుత్వలోని కీలక వ్యక్తుల పాత్రపై ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీని వెనుక ఎవరైనా మంత్రి ఉంటే వెంటనే ఆ వ్యక్తిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అంతేగాక అధికారం కోసం ఎవరైనా ఈ కుట్రకు పాల్పడితే శాసనసభే నైతికతను కోల్పోతుందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో అధికారం కోసం కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. అధిష్ఠానానిదే తుది నిర్ణయమని రెండు వర్గాలు చెబుతున్నప్పటికీ లోలోపల ఎవరికి వారే అధికార పీఠం కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు.
తాజాగా హనీ ట్రాప్ కుంభకోణం వెలుగుచూడడం, అందునా స్వయంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ మంత్రే దీనిపై ఆందోళన వ్యక్తం చేయడం పలు సందేహాలకు దారితీస్తోంది. శుక్రవారం దీనిపై వాడీవేడిగా అసెంబ్లీలో చర్చ జరిగింది. కేంద్రంలోని నాయకులతోసహా 48 మంది రాజకీయ నేతలపై హనీ ట్రాప్ జరిగినట్టు సహకార మంత్రి కేఎన్ రాజన్న గురువారం అసెంబ్లీలో ప్రకటించగా ఫిర్యాదు చేస్తే దర్యాప్తునకు ఆదేశిస్తానని హోం మంత్రి జీ పరమేశ్వర హామీ ఇచ్చారు. శుక్రవారం సభ ప్రారంభం కాగానే కాగానే ప్రతిపక్ష బీజేపీ సభ్యులు దీనిపై న్యాయ విచారణ కోసం డిమాండ్ చేస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గ్యారెంటీడ్..గ్యారెంటీడ్.. హనీట్రాప్ గ్యారెంటీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హనీ ట్రాప్ ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో సమాధానం ఇవ్వాలని వారు పట్టుపట్టారు.
హనీ ట్రాప్ కుంభకోణంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని సిద్ధరామయ్య హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. పోస్టర్లు, సీడీలు చూపిస్తూ హనీ ట్రాప్ గ్యారెంటీతో మంత్రులు, ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ వారు సభలో పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభ అదుపులోకి రాకపోవడంతో 18 మంది బీజేపీ సభ్యులను ఆరు నెలలపాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ఖాదర్ ప్రకటించారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రజాప్రతినిధుల జీతాలు రెట్టింపయ్యాయి. గ్యారెంటీలను అమలుచేయని కాంగ్రెస్ సర్కారు.. ఎమ్మెల్యేలు, మంత్రుల వేతనాలను మాత్రం భారీగా పెంచింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు శుక్రవారం శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో సీఎం సిద్ధరామయ్య జీతం 75 వేల నుంచి 1.50 లక్షల రూపాయలకు పెరుగుతుంది. అలాగే మంత్రులందరికీ 108 శాతం పెంపుతో ప్రస్తుతమున్న 60 వేల నుంచి 1.25 లక్షలవుతుంది. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం 40 వేల నుంచి 80 వేలు, వారి పెన్షన్ 50 వేల నుంచి 75 వేలు, అసెంబ్లీ స్పీకర్, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్పర్సన్ల జీతం 75 వేల నుంచి 1.25 లక్షల రూపాయలకు పెరుగుతుంది.