Karnataka : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై వెళ్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొనడంతో, ట్రాక్టర్.. బ్రిడ్జి మీద నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటక, కొప్పాల్ జిల్లా, మునీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో, తుంగభద్ర బ్రిడ్జిపై శుక్రవారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 15 మంది ప్రయాణికులతో కూడిన ట్రాక్టర్ హులిగే దేవాలయానికి వెళ్తుండగా తుంగభద్ర బ్రిడ్జిపై వెనుక నుంచి ఒక లారీ వచ్చి ఢీకొంది. లారీ డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్ల ఈ ఘటన జరిగింది. లారీ ఢీకొనడంతో బ్రిడ్జిపై ఉన్న ట్రాక్టర్.. ఆ బ్రిడ్జి మీద నుంచి కిందికి పడిపోయింది. ఈ ఘటనలో ట్రాక్టర్లో ఉన్న 15 మంది ప్రయాణికుల్లో ఆరుగురు ఘటనా స్థలంలోనే మరణించారు.
మిగతా తొమ్మిది మంది గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న కొప్పాల్ పోలీసులు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రుల్ని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు కొప్పాల్ ఎస్పీ రామ్ ఎల్ అరాసిద్ధి తెలిపారు.