Karnataka | బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య దిగిపోగానే ఆ పీఠాన్ని అందుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు డిప్యూటీ సీఎం శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వర సీఎం పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా ఇప్పుడు మరో సీనియర్ నేత ఆర్వీ దేశ్‌పాండే కూడా రేసులోకి వచ్చారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మంత్రి పదవులను నిర్వర్తించి అలిసిపోయాను. ఇక నేను ముఖ్యమంత్రిని కావాల్సి ఉంది’ అని వ్యాఖ్యానించారు. తాను సిద్ధరామయ్య కంటే రెండేండ్లే పెద్దవాడినని, కాంగ్రెస్ అధిష్ఠానం, సిద్ధరామయ్య అంగీకరిస్తే సీఎం అవుతానని ప్రకటించారు. దీని ద్వారా సిద్ధరామయ్యకు పదవీగండం పొంచి ఉందనే విషయాన్ని దేశ్‌పాండే చెప్పకనే చెప్పారు. ముడా స్కామ్‌లో సిద్ధరామయ్య ప్రమేయం లేదని చెప్తూనే దేశ్‌పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినందుకు రామకృష్ణ హెగ్డే సీఎంగా రాజీనామా చేశారని, కానీ ఇప్పుడు విలువలతో కూడిన రాజకీయా లు లేవని వ్యాఖ్యానించారు.
ముడా (మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్య అక్రమాలపై సంచలన విషయాలు బయటపెట్టిన ఆర్టీఐ కార్యకర్త ఎన్ గంగరాజు, తనకు ప్రాణహాని ఉందని మీడియా ముఖంగా భయాందోళన వ్యక్తం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు తనను, తన కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారని సోమవారం విలేకర్లతో చెప్పారు. రియల్ మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనకు భద్రత కల్పించాలంటూ సీఎం కార్యాలయానికి లేఖ రాసినట్టు తెలిపారు. దీంతో మైసూర్‌లోని ఆయన ఇంటివద్ద కర్ణాటక పోలీసులు పెట్రోలింగ్ చేపట్టారు.
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక, వ్యక్తిగత సామాజిక మాధ్యమాల ఖాతాల నిర్వహణ కోసం నెలకు రూ.53.9 లక్షలు (18 శాతం జీఎస్టీతో కలిపి) ఖర్చు అవుతున్నది. 2023 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు రూ.3.18 కోట్లు ఖర్చు అయింది. ఈ సొమ్మును ‘ది పాలసీ ఫ్రంట్’ అనే ఖాతాకు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఈ ఖాతాల నిర్వహణకు 35 మంది సిబ్బ ంది ఉన్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం దాఖలు చేసిన దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో కర్ణాటక రాష్ట్ర మార్కెటింగ్ కమ్యూనికేషన్ అండ్ అడ్వర్టయిజింగ్ లిమిటెడ్ (ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ) ఈ వివరాలను తెలిపింది.