బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. యూనివర్శిటీ ఛాన్సలర్‌గా గవర్నర్ బదులు సీఎంను నియమించింది. దీనికి సంబంధించిన బిల్లును ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ( CM As University Chancellor) ప్రతిపాదిత సవరణ బిల్లు ప్రకారం కర్ణాటక రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌గా గవర్నర్ స్థానంలో ఇకపై ముఖ్యమంత్రి ఉంటారు. గురువారం సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, ఆ రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్ పాటిల్ ఈ బిల్లు గురించి మీడియాతో మాట్లాడారు. కర్ణాటక రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ విశ్వవిద్యాలయం సవరణ చట్టానికి మంత్రివర్గం సమ్మతి తెలిపిందని చెప్పారు. ఇప్పటి వరకు ఛాన్సలర్‌గా గవర్నర్ ఉండగా, ఈ సవరణతో ఛాన్సలర్‌గా ముఖ్యమంత్రి ఉంటారని అన్నారు. దీంతో ఛాన్సలర్ అధికారాలన్నీ సీఎంకు బదిలీ అవుతాయని తెలిపారు. ప్రస్తుతానికి ఈ యూనివర్సిటీకి మాత్రమే ఈ సవరణ వర్తిస్తుందని చెప్పారు. మిగతా యూనివర్సిటీల ఛాన్సలర్ మార్పుపై కూడా త్వరలో చర్చిస్తామని అన్నారు. అయితే ఈ బిల్లును గవర్నర్ ఆమోదించాల్సి ఉంది.
మరోవైపు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ స్థానంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కొత్త ఛాన్సలర్‌గా నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్రంలో ప్రతిపక్షమైన బీజేపీ శుక్రవారం ఖండించింది. రాష్ట్రంలోని ఉన్నత విద్యావ్యవస్థను రాజకీయం చేసి అస్థిరపరిచే ప్రయత్నంగా ఆరోపించింది. ప్రభుత్వ నిర్ణయం గవర్నర్ అధికారాలను దెబ్బతీసేందుకు, రాజ్యాంగ నిర్మాణాలకు విఘాతం కలిగించే కుట్ర అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర విమర్శించారు.