సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కొత్తగా ఇచ్చే విద్యుత్ కనెక్షన్ల తీరు అస్తవ్యస్తంగా మారింది. దక్షిణ డిస్కంలో అధికారులు తీసుకొస్తున్న కొత్త రూల్స్‌తో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. నగరశివారు ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్లు రాకపోవడంతో వేలకొద్ది భవనాలు కరెంట్ లేక అంధకారంలో ఉన్నాయి. అయితే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే కొత్త కనెక్షన్ ఇస్తామని చెప్పడంతో పలు చోట్ల ఓసీ లేక కనెక్షన్లు రాక సతమతమవుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే కొత్తగా మరో దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. శివారు ప్రాంతంలోని పలు డివిజన్లలో కొత్తగా వందల సంఖ్యలో భవన నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో కొంతమంది సిబ్బంది చేస్తున్న పనులతో వినియోగదారులు చుక్కలు చూస్తున్నారు. అడిగనంత డబ్బులు కట్టినప్పటికి మీటర్లు రాక, వచ్చిన మీటర్లు ఎప్పుడు తీసుకెళ్లిపోతారో తెలియక భవన యజమానులు సతమతమవుతున్నారు. ఒకసారి పెట్టిన మీటర్లు తీసుకుపోతారంటే బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారు.. మీటర్ చెడిపోతే రీప్లేస్మెంట్ చేస్తారు తప్ప పెట్టిన వెంటనే తీసుకెళ్లిపోతున్న వైనం దీంతో ఆ భవనాలకు సరఫరా నిలిపివేసిన తీరు విమర్శలకు దారితీస్తోంది. నగర శివారులో పదిరోజుల క్రితం ఇచ్చిన మీటర్లు అందుకోసం పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్న అధికారులు, సిబ్బంది బిగించిన మీటర్లను ఆ తర్వాత తిరిగి తీసుకెళ్తున్న తీరు ప్రస్తుతం నగరవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సైబర్‌సిటీ సర్కిల్లోని కొండాపూర్ డివిజన్లో కేపీహెచ్‌బీ సబ్‌డివిజన్‌లోని బాలాజీనగర్‌లో ఓ భవనానికి గత నెల 29న మీటర్లు ఇస్తూ కనెక్షన్ ఇవ్వాలంటూ ప్రాంత ఏఈ డివిజనల్ ఏడీఈకి లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన డబ్బులు గత సంవత్సరం ఆగస్ట్‌లోనే భవన యజమాని చెల్లించారు. పది రోజుల క్రితం మీటర్లు తీసుకొచ్చి బిగించిన కరెంట్ సిబ్బంది భవనానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. తీరా రెండురోజుల క్రితం ఒక్కసారిగా వచ్చి మీకు ఓసీ లేదంటూ ఇచ్చిన మీటర్లన్నీ తీసుకెళ్లిపోవడమే కాకుండా విద్యుత్ కనెక్షన్‌ను తొలగించారు. ఇదేంటని అడిగిన యజమానిని మేమేం చేయలేమంటూ, పై నుంచే ఉత్తర్వులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తాను కనీసం పదిలక్షలకు పైగా డబ్బులు చెల్లించానని, అంతేకాకుండా లంచాలు కూడా ఇచ్చానంటూ యజమాని పెద్ద ఎత్తున గొడవ చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఓసీ వస్తేనే తాము కనెక్షన్ ఇస్తామంటూ బిగించిన మీటర్లు తీసుకెళ్లిపోవడంతో ప్రస్తుతం ఆ యజమాని సదరు అధికారులు, సిబ్బంది వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్లికేషన్ పెట్టే సమయంలోనే తమకు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయని, ఒకవేళ అనధికారిక కట్టడం ఉంటే అందుకు తగినట్లుగా కేటగిరీ 8లో బిల్లు చెల్లిస్తామని కూడా స్థానిక అధికారులకు బాండ్ కూడా రాసిచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా ముడుపులు తీసుకున్నప్పటికీ తాజాగా ఓసీలపై డిస్కం ఉన్నతాధికారులనుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో బిగించిన కరెంట్ మీటర్లను విప్పుకెళ్లిపోవడంతో ఆ భవనానికి కరెంట్ లేకుండా పోయింది. ఇదిలా ఉంటే మీటర్లు తీసుకెళ్లిపోయినప్పటికీ.. కనెక్షన్ తొలగించినా ఇప్పటికీ డిస్కం సైట్లో అప్లికేషన్ స్టేటస్ మాత్రం సర్వీస్ రిలీజ్ చేసినట్లుగా కనిపిస్తోంది. తాము ఇచ్చిన కనెక్షన్‌ను మళ్లీ తొలగించి పోవడం వెనక మతలబేంటనేది ప్రస్తుతం డిస్కం సర్కిల్లో చర్చ జరుగుతుంది. డీఈ, ఏడీఈ, ఏఈ, లైన్మెన్ వరకు అందరికీ ఈ దందాలో భాగస్వామ్యం ఉందని, ఇరవైకి పైగా మీటర్లు ఇచ్చిన నేపథ్యంలో లక్షల రూపాయల ముడుపులు ముట్టినట్లుగా సమాచారం.
గ్రేటర్ పరిధిలోని పలు సర్కిళ్లలోని డివిజన్లు, సెక్షన్లలో కొందరు అధికారులు సిబ్బంది ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అయినా వారిపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.విద్యుత్ కనెక్షన్ల పేరుతో ఒకవైపు వినియోగదారుల నుంచి డబ్బులు దండుకుంటూనే మరోవైపు వారిని ముప్పతిప్పలు పెడుతున్నారు. లక్షల రూపాయల లంచాలు తీసుకుంటూ చేస్తున్న ఈ దందాపై నిఘా పెట్టాల్సిన విజిలెన్స్ విభాగం తమ పనితాము చేస్తూనే ఉన్నా మిగతా విభాగాల నుంచి ఈ అక్రమార్కులకు అండదండలు ఉన్నాయనే చర్చ మింట్ కాంపౌండ్‌లో జరుగుతోంది. ఒకవైపు మీటర్లు ఇచ్చే సమయంలో కనెక్షన్‌కు కావలసిన పత్రాలు అన్నీ సరిచూసుకుంటున్న సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించడంలో డిస్కం నిబంధనలకే నీళ్లొదులుతున్నారు. ఈ వ్యవహారంలో కార్పొరేట్ ఆఫీసు నుంచి సబ్ డివిజన్ వరకు అందరికి వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున బిల్డింగులకు కనెక్షన్లు ఇచ్చే క్రమంలో ఈ దందా జరుగుతున్నదని, కొందరు తమకు కనెక్షన్ ఇచ్చి నిబంధనలను పాటిస్తామని రాసిచ్చినా కొత్తగా ఇటీవల బదిలీలలో వచ్చిన వారు పాతవారు తమ వాటా తీసుకుంటే మాకు ముట్టలేదు కదా అంటూ తమకు రావలసిన వాటా రాని పక్షాన వినియోగదారులను అంధకారంలోకి నెట్టేస్తున్నారంటూ స్థానిక సిబ్బందిపై విమర్శలు వినిపిస్తున్నాయి.