బెంగళూరు, జూలై 28 : కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2024-2025 మధ్యకాలంలో 981 మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వీరిలో 825 మంది వ్యవసాయ సంబంధిత కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకోగా 138 మంది ఇతర కారణాల వల్ల ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 807 మందికి నష్టపరిహారం చెల్లించింది. ఆత్మహత్యలు అధికంగా చోటుచేసుకున్న జిల్లాల్లో హవేరీ (128) మొదటి స్థానంలో ఉండగా 73 మందితో మైసూరు రెండోస్థానంలో నిలిచింది. ధార్వాడ్లో 72 మంది, బెలగావిలో 71 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలో రైతుల బలవన్మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుండి వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ తిప్పి కొట్టారు. రైతుల ఆత్మహత్యలపై బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని అన్నారు. ఎరువుల కొరత, రైతుల బలవన్మరణాల అంశాన్ని ఇప్పటికే కేంద్రం దృష్టికి తెచ్చామని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర పెంచుతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, ఇంతవరకు ఆ ఊసే లేదని విమర్శించారు. డీజిల్ ధరలు మండిపోతున్నాయని, దీనికి పన్నుల భారం మరింత పెరిగిందని చెప్పారు. రైతులపై కేంద్రం పన్నుల భారాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.