బెంగుళూరు: ఓ మహిళను బ్లాక్మెయిల్ చేసి, ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన కేరళ పూజారి(Kerala Priest)ని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో పూజారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అరెస్టు చేసిన వ్యక్తిని అరుణ్గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. కేరళలోని పెరింగొట్టుకుర ఆలయంలో అతను పూజారిగా చేస్తున్నారు. ఆ ఆలయంలోని ప్రధాన పూజారిగా ఉన్న ఉన్ని దామోదరన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బాధితురాలికి.. ఆ గుడికి వెళ్లాలంటూ ఆమె మిత్రులు సలహా ఇచ్చారు. బెంగుళూరుకు చెందిన ఆ మహిళ.. ఆలయానికి చెందిన వీడియోను చూసి ఆ గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నది. ప్రత్యేక పూజలు నిర్వహిస్తే తన ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయని ఆమె భావించింది. పూజ చేసేందుకు ఆలయానికి వెళ్లిన సమయంలో బాధితురాలికి నిందితుడు పరిచయం అయ్యాడు.
పూజారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత వారిపై బాధితురాలికి నమ్మకం కలిగింది. అయితే ఆ తర్వాత వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు పూజారులు. ఆమె దయనీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, చేతబడి చేస్తానని బెదిరించారు. గుడికి పిలిచి సహకరించాలని ఆమెను బెదిరించారు. అసంబద్దమైన శృంగారం చేయాలని వాళ్లు బలవంతం చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. తనకు తమిళం, కన్నడ భాషలు తెలుసు అని ఆమె పోలీసులకు చెప్పింది.
పూజ చేస్తామని చెప్పి ఆ పూజారులు 24 వేలు డిమాండ్ చేశారు. ఆమె మొబైల్ నెంబర్ తీసుకున్నారు. అరుణ్, ఉన్ని దమోదరన్ పూజారులు ఆ తర్వాత ఆమెకు పదేపదే కాల్స్ చేశారు. మీ కుటుంబంపై చేతబడి చేశారని, దాన్ని పోగొట్టేందుకు పూజలు చేస్తామని ఆ మహిళను నమ్మించారు. తన ఆదేశాలు ఫాలో కావాలని ఆమెను ఆదేశించారు. నిందితుడు న్యూడ్ కాల్ చేసి.. బాధితురాలిని కూడా నగ్నంగా వీడియో కాల్ చేయాలన్నాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. పిల్లలపై చేతబడి చేస్తానని మళ్లీ బెదిరించి, ఆమెను లొంగిపోవాలన్నాడు.
ప్రత్యేక పూజల కోసం కేరళకు రావాలని పూజారి మళ్లీ బెదిరించాడు. బ్లాక్ మ్యాజిక్ భయంతో కేరళకు వెళ్లిందామె. పూజలు చేసిన తర్వాత ఆ మహిళను కారులో అడవికి తీసుకెళ్లారు. ఆమెతో శృంగారం చేసేందుకు ప్రయత్నించారు. పూజ పూర్తి అయ్యేందుకు ఇది తప్పదన్నారు. అయితే వారి నుంచి తప్పించుకున్న ఆ మహిళ.. బెంగుళూరులోని బెల్లాండుర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారు.