Tattoo | కర్నాటక, మార్చి 1: కర్నాటక ప్రభుత్వం పచ్చబొట్ల(టాటూ) పార్లర్లపై నియంత్రణ చర్యలకు సిద్ధమైంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా టాటూ పార్లర్లు నిర్వహించడం వల్ల చర్మ వ్యాధులు, చర్మ క్యాన్సర్, హెపటైటిస్-బీ, సీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో పాటు హెచ్ఐవీ కూడా సంక్రమించే ప్రమాదముందని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.
ఇలాంటి ఘటనలు జరిగిన విషయాన్ని అధికారులు ఉదహరిస్తున్నారు. టాటూ పార్లర్ల ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమస్థాయి మార్గదర్శకాలు రూపొందించుకునేలా కేంద్రం చట్టం రూపొందించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఈ మేరకు కర్నాటక ఆరోగ్యశాఖ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ప్రస్తుతం టాటూ పార్లర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా చట్టాలేమీ లేకపోవడంతో నియంత్రణ కొరవడింది. డ్రగ్స్ లేదా కాస్మెటిక్స్ చట్టం పరిధిలోకి రాని లోహాలను వినియోగిస్తూ టాటూలు వేస్తున్నట్టు కమంత్రి దినేశ్ గుండురావు తెలిపారు. అపరిశుభ్రత, ప్రమాదకరమైన రసాయనాల వినియోగంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. కాబట్టి టాటూ పార్లర్లపై తప్పనిసరిగా మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.